ధీరుభాయ్ అంబానీ విజయాలు...... జీవిత చరిత్ర......

ధీరుభాయ్ అంబానీ విజయాలు...... జీవిత చరిత్ర......



మన దేశ ఆర్థిక స్థితి గతులను మార్చే శక్తి రిలయన్స్ కంపెనీకి ఉంది. మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం రిలయన్స్ కంపెనీ. దీనికి పునాదులు వేసిన వ్యక్తి ధీరుభాయ్ అంబానీ. ఈయన చదివింది పదో తరగతి దాకే అయినా లక్షలాదిమంది ఇంజనీర్లకు ఉపాధి కల్పించారు. ఒకప్పుడు పని కోసము పక్క దేశము వెళ్లారు. కానీ, ఇప్పుడు ఆయన స్థాపించిన కంపెనీ వందకు దేశాలలో పైనే విస్తరించింది. అసలు ఒకానొక సమయములో పెట్రోల్ బంక్ లో పని చేసిన వ్యక్తి ప్రపంచంలోనే అతిపెద్ద పెట్రోల్ కంపెనీని నిర్మించారు. ఈయన దగ్గర డబ్బు లేదు, సరైన చదువు లేదు అయినా ఇన్ని లక్షల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపించి బిజినెస్ ఐకాన్ గా మారారు.

ధీరుభాయ్ అంబానీ గారి బాల్యము

ధీరుభాయ్ అంబానీ 1932 వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో జన్మించారు. వీరి తండ్రి స్కూల్లో టీచర్ గా పనిచేసేవారు. ధీరుభాయ్ అంబానీ తెలివైన వారు. ధీరుభాయ్ అంబానికి బాగా చదువుకోవాలని ఉండేది. కానీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వలన పదో తరగతి తర్వాత చదువుని ఆపేశారు. అప్పటికే ధీరుభాయ్ అంబానీ అన్నయ్య ఏమేన్ దేశంలోని ఏడెన్ పట్టణంలో పని చేస్తుండడంతో వాళ్ల నాన్న గారు ధీరుభాయ్ అంబానీ ని కూడా అక్కడికే పని కోసము పంపించారు. అప్పుడు ధీరుభాయ్ అంబానీ గారు ఏమేన్ దేశంలో 16 సంవత్సరాల వయసులో పెట్రోల్ బంకులో అటెండెంట్ గా పనిలో చేరారు. అంతేకాకుండా ఏ బేసి అండ్ కో అనే కంపెనీలో కూడా పనిచేసేవారు. ఈ కంపెనీ ఆహారపు ధాన్యాలు, వస్త్రాలు, పెట్రోలియం వంటి ఎన్నో వస్తువులను వివిధ దేశాలకు ఎగుమతి దిగుమతి చేసే కంపెనీ. ఇక్కడ ధీరుభాయ్ అంబానీ ఎన్నో వ్యాపారపు మెలకువలను నేర్చుకున్నారు. వివిధ దేశాల వ్యాపారస్తులతోసంబంధాలు పెంచుకున్నారు. కంపెనీ అకౌంటింగ్ ఎలా చూడాలి, డాక్యుమెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు వీళ్ళతో ఎలా డిల్ చేయాలి అని ఒక్కొక్కటిగా తెలుసుకున్నారు. అలాగే రాత్రి సమయాలలో ఇంగ్లీష్ వార్తాపత్రికలు, పుస్తకాలు చదివి ఇంగ్లీష్ నేర్చుకున్నారు. సుమారు పది సంవత్సరాలు అక్కడే పని చేసిన తర్వాత 1957 వ సంవత్సరంలో ధీరుభాయ్ అంబానీ భారతదేశానికి తిరిగి వచ్చేసారు.

ధీరుభాయ్ అంబానీ మొదలుపెట్టిన మొదటి వ్యాపారము

26 ఏళ్ల వయసులో ఆయన దగ్గర ఉన్న 17వేల రూపాయలతో ముంబైలో రెండు టేబుల్లు, మూడు కుర్చీలు, ఒక టెలిఫోన్ ఉన్నటువంటి చిన్న గదిలో రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ అనే వ్యాపారాన్ని మొదలుపెట్టారు. దీని ద్వారా నూలు దారలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేయడము చేసేవారు. అలాగే ఇక్కడి నుంచి మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలను గల్ఫ్ దేశానికి ఎగుమతి చేసే వ్యాపారాన్ని చేసేవారు. అప్పటికే ఆ రంగంలో ఎన్నో మెలకువలు నేర్చుకొని ఉండటం, ఇతర దేశాల వ్యాపారస్తులతో మంచి సంబంధము కలిగి ఉండటంతో మంచి లాభాలను సంపాదించారు.

ధీరుభాయ్ అంబానీ గారు చేసిన వ్యాపారాలు

అప్పట్లో భారత దేశంలో టెక్స్టైల్ రంగానికి మంచి భవిష్యత్తు ఉంటుందని ముందే ఊహించి అహ్మదాబాద్ లో టెక్స్టైల్ మిల్ ని ప్రారంభించారు. విమల్ అనే బ్రాండ్ పేరుతో వీటిని అమ్మేవారు. ఆ సమయంలో విమల్ బాగా అమ్ముడుపోయిన ఫ్యాబ్రిక్ గా మారింది. ఈయన సంపాదించడంతో పాటుగా తన సంపాదనలో భారతీయులను కూడా భాగస్వాములను చేయాలని కోరుకొని అందుకోసం 1977లో రిలయన్స్ కంపెనీని స్టాక్ మార్కెట్లో నమోదు చేశారు. ఆ రోజుల్లోనే 58 వేల మందికి పైగా పెట్టుబడిదారులు రిలయన్స్ కంపెనీలోని షేర్లను కొన్నారు. ఆ రిలయన్స్ షేర్లను కొన్న వారిలో చాలా మంది ధనవంతులుగా మారిపోయారు. కొన్ని రోజుల్లోనే రిలయన్స్ కంపెనీ టెలికాం, ఎనర్జీ, ఐటీ, పెట్రో కెమికల్స్ ఇలా వివిధ రంగాలలో విస్తరించింది. అయితే ధీరుభాయి గారి ప్రయాణము అంత సులభంగా జరగలేదు. ఈయనకు ఎంతోమంది శత్రువులు తయారు అయ్యారు. అవకాశం దొరికినప్పుడల్లా ధీరుభాయ్ అంబానికి ప్రభుత్వం వైపు నుంచి అడ్డంకులు కలిగించేవారు. వాళ్లు ఎంత ప్రయత్నించినప్పటికీ ధీరుభాయ్ భయపడలేదు. వాళ్లు ఎన్ని అడ్డంకులు కలిగిస్తే వాటిని అవకాశాలుగా మార్చుకొని మరింత ఎదిగారు ధీరుభాయ్ అంబానీ గారు.

ధీరుభాయ్ అంబానీ గారి మరణము

ధీరుభాయ్ అంబానీ కి 1986లో ఆయన కుడి చేతికి పక్షవాతం వచ్చింది. 16 సంవత్సరాల తర్వాత మళ్లీ త్రీవ్ర పక్షవాతం రావడముతో ముంబైలోని హాస్పిటల్లో చేర్చారు. వారం రోజులపాటు కోమాలో ఉన్న ధీరుభాయ్ అంబానీ గారు జులై 2 2002వ సంవత్సరములో మరణించారు.

ధీరుబాయ్ అంబానీ జీవితము ఆధారంగా వచ్చిన సినిమా:
ధీరుభాయ్ అంబానీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని 2007వ సంవత్సరంలో గురు అనే ఒక హిందీ సినిమా కూడా విడుదలైంది.

ధీరుభాయ్ అంబానీ గారు చనిపోయే నాటికి 2.9 బిలియన్ల ఆస్తితో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో 132వ స్థానంలో నిలిచారు.

ముంబైలో ఒక చిన్న గదిలో ప్రారంభమైన ఆయన స్థానము ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలలో ఒక దాని వరకు చేరింది. ధీరుభాయ్ అంబానీ గారు చనిపోయిన తర్వాత రిలయన్స్ కంపెనీ ధీరుభాయ్ కుమారులు అయినటువంటి ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ చేతుల్లోకి వెళ్ళింది. అయితే వీరిద్దరి మధ్య ఉన్న విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయి కంపెనీలోని వాటాను ఇద్దరు పంచుకున్నారు.

ధీరుభాయి గారికి భారతదేశం గొప్ప ఆర్థిక శక్తిగా మారాలని కోరిక. అందుకు ఈయన ఎంతగానో కృషి చేశారు. గత పది సంవత్సరాలలో ఈయన స్థాపించిన రిలయన్స్ కంపెనీ గవర్నమెంట్ కి రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల టాక్స్ ని చెల్లించారు. అంతే కాదు రెండు లక్షల యాభై వేల మందికి పైగా ఇప్పుడు రిలయన్స్ కంపెనీలో పని చేస్తున్నారు.

పదో తరగతితో చదువు మానేసిన ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడము, ఇన్ని కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించడము అంటే మాటలు కాదు.

వ్యాపార రంగములో ఈయన కృషికి గాను ప్రభుత్వము మన దేశములోనే రెండో వ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మ విభీషన్ తో ఆయనని గౌరవించింది.

ఒక పెట్రోల్ బంక్ లో పని చేస్తూ తానే సొంతంగా ఒక పెట్రోల్ కంపెనీని నిర్మించాలి అనే కలలుకనే వారికి ఎంతో ధైర్యము, ముందుచూపు ఉండాలి. నిజము చెప్పాలంటే అప్పట్లో ఆయనకు ఉన్న చదువు కన్నా మనము ఇప్పుడు ఎక్కువే చదువుకుంటున్నాము. అప్పటికన్నా ఇప్పటి పరిస్థితులు చాలా బాగుపడ్డాయి. కానీ ఆయన సాధించగలిగినది మనము ఎందుకు సాధించలేకపోతున్నాము. ఎందుకంటే ఆయనలాగా పెద్ద పెద్ద కలలను కనడానికి మనము భయపడుతున్నాము. అందుకే ధీరుభాయ్ అంబానీ గారు అంటారు " పెద్దగా ఆలోచించండి, వేగంగా ఆలోచించండి, అందరికన్నా ముందుగా ఆలోచించండి, ఆలోచనలు అనేవి ఎవరి సొత్తు కాదు".

జీవితము లో ఏదైనా సాధించాలి అంటే చదువు, డబ్బు అవసరము లేదని సాధించాలనే తపనకు తగ్గ శ్రమ ఉంటే చాలని నిరూపించారు ధీరుభాయ్ అంబానీ గారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!