యువతకు స్ఫూర్తి నింపిన.... చేగువేరా జీవితము....

యువతకు స్ఫూర్తి నింపిన.... చేగువేరా జీవితము....


తలపై ఒక టోపీ దానిపై ఒక నక్షత్రము, పొడవుగా పెరిగిన జుట్టు, తేజస్సుతో నిండిన ముఖము, నిర్భయంగా చూస్తున్న కళ్ళు, ఏదో ఒక సమయములో మనమందరము ఈ రూపాన్ని చూసే ఉంటాము. టీ షర్ట్స్ , బైకులు, పోస్టర్లు, వాల్ పేపర్లు, పచ్చబొట్లు ఇలాంటి చోట్లలో మనము ఈ రూపాన్ని చూసి ఉంటాము. సినిమా హీరోల కన్నా క్రీడాకారుల కన్నా ఎక్కువగా యువత ఈయనను అభినందిస్తారు. ఆయన ఎవరో కాదు "చే గువేరా" గారు.

చే గువేరా బాల్యము, విద్యాబ్యాసము

చే గువేరా అసలు పేరు "ఎర్నెస్టో రాఫెల్ గువేరా డి లా సెర్నా". ఈయన జూన్ 14 1928 వ సంవత్సరములో అర్జెంటీనాలో జన్మించారు. చే గువేరా గారికి చిన్న వయసులోనే ఆస్తమా సోకింది. ఈయన శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఈయన మొదట్లో ఇంజనీరింగ్ లో చేరారు కానీ అది నచ్చక అది మానేసి మెడిసిన్ లో చేరారు. మెడిసిన్ చదువుతున్నప్పుడు లాటిన్ అమెరికా అంతా ఒకసారి పర్యటించాలని అనుకున్నారు. 1952లో తన స్నేహితుడు ఆల్బెట్టో తో కలిసి ఒక మోటార్ సైకిల్ మీద లాటిన్ అమెరికా అంతా పర్యటించడానికి బయలుదేరారు. ఆ ప్రయాణమే చే గువేరా జీవితములో ఊహించని మార్పులు తీసుకొని వచ్చింది. అమెరికాలోని దక్షిణ అమెరికా ప్రాంతాన్ని లాటిన్ అమెరికా అని కూడా అంటారు. ఈ భాగములోని దేశాలన్నీ కూడా పేదరికంతో నిండిపోయి ఉండేది. ఉత్తర అమెరికాలోని ధనికులైన పెట్టుబడిదారీలు, కొంతమంది దోపిడీదారులు ఈ పేద దేశాల్లోని గనులు, భూ భాగాలను ఆక్రమించుకొని అక్కడ ఫ్యాక్టరీలను నిర్మించి ఆ ప్రాంతములో నివసించే పేద ప్రజలను కూలీలుగా మార్చి వాళ్లతో చాకిరీలు చేయించేవారు. ఇక్కడి సంపదను వాళ్లు దోచుకునేవారు. చే గువేరా చేస్తున్న ఈ ప్రయాణములో భాగంగా లాటిన్ అమెరికాలోని ప్రజల బానిస బతుకులను కల్లారా చూసి చలించి పోయారు. వాళ్ల జీవితాలలో మార్పు తీసుకుని రావాలని అనుకున్నారు. అలా 9 నెలల పాటు ప్రయాణము సాగిన తర్వాత వెనక్కి తిరిగి వచ్చి 1953లో మెడిసిన్ లో డిగ్రీ సంపాదించుకున్నారు చే గువేరా గారు.

యుక్త వయసు నుంచి మార్క్సిజం విధానాల మీద చే గువేరాకి ఆసక్తి ఉండేది. అందుకే లాటిన్ అమెరికాలోని సామ్రాజ్యవాదులను ఎదుర్కోవడానికి తన వైద్య వృత్తి సరిపోదని విప్లవము ఒకటే మార్గమని అర్థము చేసుకున్నారు. తాను చేయాలనుకుంటున్న దాని గురించి తన తల్లిదండ్రులకు చెప్పి బోలివియాలో తన విప్లవాన్ని మొదలుపెట్టారు. అయితే అక్కడ నాయకత్వపు లోపము ఉండటం వలన అక్కడి నుంచి గ్వాటెమాలా కు చేరుకున్నారు. అక్కడే ఎంతో మంది విప్లవ నాయకులతో పరిచయం ఏర్పడింది. 

చే గువేరా వివాహము

హిల్డా గడియా అనే ఒక అమ్మాయి తో పరిచయము ప్రేమగా మారి వివాహము చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి జన్మించింది. తర్వాత కొంతకాలానికి ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. అదే సంవత్సరము అలీడా మార్చి అనే అమ్మాయిని వివాహము చేసుకున్నారు చే గువేరా గారు.

క్యూబా విప్లవము

క్యూబాలో పటిష్ట నియంకుష పాలనకు వ్యతిరేకంగా విప్లవం చేస్తున్న క్యాస్ట్రో గురించి తెలుసుకున్నారు చే గువేరా గారు. చే గువేరా క్యాస్ట్రోని కలుసుకున్నారు. అలా క్యాస్ట్రో, చే గువేరా మరో 82 మందితో కలిసి పతిస్తాను క్యూబా అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి ఒక పడవలో మెక్సికో నుంచి క్యూబాకు వెళ్లారు. క్యాస్ట్రో మరియు చే గువేరా క్యూబా చేరిన తర్వాత క్యూబా ప్రభుత్వానికి వీరికి మధ్య విపరీతమైన దాడులు జరిగాయి. ఈ యుద్ధములో అమెరికా కలగజేసుకొని బరిష్ట ప్రభుత్వానికి ఆయుధాలు అందించి సహాయము చేసింది. క్యూబా విప్లవం జరుగుతున్న సమయములో దోపిడీదారులను పేదల నుంచి దోచుకుంటున్న వాళ్లను చే గువేరా వెతికి వెతికి చంపేశారు. అందుకే దోపిడీదారులకు చే గువేరా వస్తున్నాడు అంటే ఒంట్లో వణుకు పుట్టేది. అలా రెండు సంవత్సరాల తర్వాత క్యాస్ట్రో మరియు చే గువేరా కలిసి చేసిన విప్లవము విజయవంతము అయింది.

బరిష్ట నిరంకుశ ప్రభుత్వాన్ని దింపి క్యూబా లో కాస్ట్రో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. క్యాస్ట్రో పాలనలో చే గువేరాకి క్యూబా జాతీయ బ్యాంక్ అధ్యక్షునిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా, రక్షణ దళాల అధిపతిగా ఎన్నో ఉన్నతమైన పదవులు దక్కాయి. క్యూబా లో ఉన్న అమెరికా కంపెనీలను జాతీయము చేశారు. తను పదవిలో ఉన్నప్పుడు అక్కడ ఉండే రైతులు, పేదలకు, పిల్లల కోసము వైద్యాలయాలు, పాఠశాలలు ఏర్పాటు చేశారు. దానితో క్యూబా అక్షరాస్యత ఏకంగా 96 శాతానికి పైగా పెరిగింది. దీనికి కారణము చే గువేరా కృషి మాత్రమే. అందుకే క్యూబా దేశ ప్రజలు క్యాస్ట్రో ని ఎంతగా అభినందిస్తారో చే గువేరాని కూడా అంతగా అభినందిస్తారు.

చే గువేరా భారతదేశపు పర్యటన

చే గువేరా 1959లో భారతదేశంలో కూడా పర్యటించారు. క్యూబా కి ఇండియా కి మధ్య సత్ సంబంధాలు పెరిగేలాగా కృషి చేశారు.

చే గువేరా మరణము

చే గువేరా సామ్రాజ్యవాదుల దోపిడీకి గురి అవుతున్న ఇతర ప్రాంతాలను కూడా తన విప్లవానికి తీసుకెళ్లాలని అనుకున్నారు. ఇంకేమీ ఆలోచించకుండా తనకున్న గొప్ప గొప్ప పదవులన్నిటినీ వదిలి బోలివియాలోని నియంత్ర ప్రభుత్వము అమెరికాతో చేతులు కలిపి సాగిస్తున్న దోపిడిని అంతము అందించడానికి చే గువేరా కొంతమంది బృందంతో కలిసి బొలీవియాకు బయలుదేరి వెళ్లారు. బొలివియాలో ఉన్న ఆర్మీకి సరైన శిక్షణ లేదు. వీరి దగ్గర సరైన ఆయుధాలు కూడా లేవు. కాబట్టి వీరిని ఓడించడం చాలా సులభమే అని అనుకున్నారు చేగువేరా. అయితే ఇక్కడ మళ్ళీ అమెరికా ఎదురైంది. తమకి క్యూబాలో ఎదురు తిరిగిన చే గువేరాని అంతము చేయడానికి బొలివియా సైనికులకు శిక్షణ ఇచ్చి, వీరికి ఆయుధాలు సరఫరాచేసింది అమెరికా. ఇప్పుడు చే గువేరాని బంధించడమే అమెరికా ప్రభుత్వము, బొలివియా నియంత్ర లక్ష్యము. బొలివియా సైనికులకి చే గువేరా బృందానికి మధ్య దాడులు జరిగాయి. అయితే బొలివియా అడవులలో సరైన తిండి, నిద్ర లేకపోయేసరికి బృందంలో అందరూ నిరసించి పోయారు. అందులోనూ చే గువేరా కి ఆస్తమా కారణంగా ఆరోగ్యము పూర్తిగా పాడైపోయింది. తన బరువులో సొగానికి దాకా తగ్గిపోయారు. చే గువేరా ని పట్టుకోవడానికి బొలీవియా ప్రభుత్వము 650 మంది సైనికులను రంగంలోకి దింపారు. బొలివియా మరియు అమెరికా ప్రభుత్వం కలిసి చేస్తున్న ఈ దాడులలో చేగువేరా బృందం ఒక్కొక్కరిగా మరణించి సాగారు. ఈ దాడుల్లో చే గువేరా భుజానికి బుల్లెట్ తగిలి గాయపడ్డారు. చివరికి 1967 అక్టోబర్ 8న బొలీవియా సైనికులు చే గువేరా ని పట్టుకొని బంధించారు. ఒక పాడుబడిన స్కూల్లో, చీకటి గదిలో చే గువేరా ని బంధించారు. ఆ తర్వాత రోజే బోలివియన్ గవర్నమెంట్ చే గువేరా ని చంపేమని ఆదేశాలు పంపింది. తెరాన్ అనే సైనికుడు చే గువేరా ఉన్న గదిలోకి వెళ్లారు. అతను లోపలికి రాగానే చే గువేరా మెల్లగా లేచి నిలబడ్డారు. "దేని గురించైనా ఆలోచిస్తున్నావు"అని ఆ సైనికుడు అడిగారు. "తాను విప్లవం గురించి తప్ప ఇంక దేని గురించి ఆలోచించను" అని సమాధానము ఇచ్చారు చే గువేరా. ఆ కళ్ళలో భయము అనేది కనిపించలేదు ఆ సైనికునికి. చే గువేరా కి తెలుసు అతను తనని చంపడానికి అక్కడికి వచ్చారని. అప్పుడు చే గువేరా "ఓరి పిరికివాడా కాల్చారా నువ్వు నన్ను చంపగలవేమో కానీ, నాలో ఉన్న సిద్ధాంతాన్ని చంపలేవు" అని గట్టిగా అరిచి చెప్పారు. అప్పుడు వెంటనే ఆ సైనికుడు మొదట చే గువేరా కాళ్ళ మీద కాల్చారు. తర్వాత చాతి మీద కాల్చారు. ఇలా సుమారుగా తొమ్మిది బుల్లెట్లు చే గువేరా శరీరంలోకి దూసుకుపోయాయి. చే గువేరా కుప్పకూలిపోయారు. 1967 అక్టోబర్ 9న చేగువేరా తన తుది శ్వాసను విడిచారు.

చే గువేరా గారు మరణించిన తర్వాత....

చే గువేరా మరణించిన తర్వాత అక్కడి నుంచి చేగువేరా మృతదేహాన్ని బొలీవియాలోని హాస్పిటల్ కి చేర్చారు. కనీసం హెలికాప్టర్లలో కూడా కాకుండా మృతదేహాన్ని తాళ్లతో హెలికాప్టర్ కి కట్టి వేలాడ తీసుకుంటూ వెళ్లారు. అక్కడ హాస్పిటల్ లోని డాక్టర్ చే గువేరా చనిపోయినట్లు సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ తర్వాత చే గువేరా ని చూడటానికి కొన్ని కిలోమీటర్ల దూరము నుంచి వస్తున్న వందలాది మంది ప్రజల కోసము చేగువేరా మృతదేహాన్ని అక్కడే 24 గంటల పాటు ఉంచారు. చేగువేరా కి సమాధి కడితే ప్రజలు అతని గుర్తుకు పెట్టుకుంటారని భవిష్యత్తులో ఆ స్ఫూర్తితో మరికొంత మంది విప్లవకారులు వచ్చే అవకాశం ఉందని భయపడి ఆ బోలివియన్ అధికారులు చేగువేరా మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా కప్పి పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే అంతటి వీరుడు చనిపోయారని ఎవరు నమ్మరని వారికి తెలుసు. అందుకని బొలీవియా అధికారులు చే గువేరా రెండు అరచేతులను నరికి ఒక కెమికల్ లో దాచి ఆ అరచేతులను క్యూబాకు పంపించారు. అక్కడి నుంచి వాటిని అర్జెంటీనా లో చే గువేరా వేలిముద్రలతో సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి పంపారు. అప్పుడు అవి చే గువేరా వే అని రుజువు అయింది. ఆ తర్వాత చేగువేరా మృతదేహాన్ని ఎవరికీ తెలియని ప్రదేశంలో పాతిపెట్టారు. దాంతో సుమారుగా 28 సంవత్సరాలపాటు చేగువేరా మృతదేహాన్ని ఎక్కడ సమాధి చేశారో అనేది రహస్యంగా మిగిలిపోయింది. కానీ, ఒక రిటైర్డ్ ఆర్మీ జనరల్ ఆ ప్రదేశాన్ని బయట పెట్టడంతో చివరికి ఆ ప్రదేశాన్ని తవ్వారు. ఆ గోతిలో చేగువేరా తో పాటు చనిపోయిన మరో ఆరుగురు అస్తిపంజరాలు కూడా దొరికాయి. బుల్లెట్ గాయాల వలన గాయపడిన ఎముకల ద్వారా ముఖ్యంగా ఒక అస్తిపంజరానికి రెండు అరచేతులు లేకుండా ఉండటంతో ఆ ఆస్తిపంజారాని చేగువేరాకు సంబంధించిన అస్తిపంజరముగా గుర్తించారు. తిరిగి వాటిని క్యూబాకు తీసుకువచ్చి అక్టోబర్ 17న 1997న సైనిక గౌరవ మర్యాదలతో మరల అంత్యక్రియలు జరిపారు.

చే గువేరా చనిపోయి 50 సంవత్సరాలు పైనే గడిచింది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆయన రగిలించిన విప్లవాగ్ని మండుతూనే ఉంది. ముఖ్యంగా క్యూబాలో అయితే చే గువేరాని ఒక దేవుని లాగా కొలుస్తున్నారు. ఇప్పటికీ కూడా అక్కడ స్కూల్లో చిన్న పిల్లలు చేగువేరాన్ని తలుచుకుంటూ మేము కూడా చే గువేరాలా తయారవుతామని ప్రతిరోజు ప్రతిజ్ఞ చేస్తారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ విప్లవము, ఉద్యమము జరిగిన దానికి చేగువేరా రూపము ప్రతీకగా నిలుస్తుంది. అంతలా ప్రజల నరాల్లోకి చైతన్యాన్ని ఎక్కించారు చే గువేరా. ఆస్తమా కారణంగా సరిగా ఊపిరి కూడా తీసుకోలేని ఆయన ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోశారు. ఇప్పుడు ఈ నమ్మకానికి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉంది. ఇతని రూపం కొన్ని లక్షల మందికి ధైర్యము. చేగువేరా చేసిన పోరాటము, రగిలించిన స్ఫూర్తి ఎప్పటికీ మరిచిపోలేనిది. ఈయన మనకే కాదు రాబోయే తరాలు అందరి మదిలో నిలిచిపోతారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!