చత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర....
16 సంవత్సరాల వయసులో కత్తి పట్టి యుద్ధము చేసిన వీరుడు. యుద్ధములో ఎత్తుకు పై ఎత్తులు వెయ్యడములో ధీరుడు. తన రాజ్యములోని ప్రజలకు కష్టాలు రాకుండా మహిళల క్షేమము కోరే మహానుభావుడు. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి, మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించారు. ఈయన పేరు ధైర్య పరాక్రమాలకు నిలువెత్తు నిదర్శనము. అతనే "చత్రపతి శివాజీ మహారాజ్".
చత్రపతి శివాజీ జననము
చత్రపతి శివాజీ క్రీ.శ 1630 ఫిబ్రవరి 19న వైశాఖ మాసము శుక్లపక్షాన తదియ నాడు పూణేలో జన్మించారు. శివాజీ తల్లి పేరు జీజాబాయి, తండ్రి పేరు షాహాజీ భోంస్లే. శివాజీ యొక్క అన్న శంభాజీ షాహాజీ భోంస్లే. తన తల్లికి శంభాజీ తర్వాత పుట్టిన వారు అందరూ మరణిస్తూ ఉండగా శివయ్య అంటే పార్వతిదేవి పేరు శివాజీ కి పెట్టుకుంది. శంభాజీ శివాజీ ఇద్దరు అన్నదమ్ములు.
చత్రపతి శివాజీ యొక్క గురువులు
శివాజీ వ్యక్తిత్వము ప్రముఖంగా నలుగురు గురువుల గురించి చెప్పాలి. వీరందరి శిక్షణలో అత్యంత పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు, మేధావి అయ్యారు శివాజీ. శివాజీ యొక్క మొదటి గురువు తల్లి జీజాబాయి. బాల్యములో ఆమె చెప్పిన కథలు శివాజీని పరాక్రమవంతునిగా తీర్చిదిద్దాయి. రెండో గురువు దాదాజీ కొండదేవ్. ఈయన దగ్గర రాజకీయము, యుద్ధ తంత్రము నేర్చుకున్నారు. మూడవ గురువు తుకారం. ఈయన దగ్గర సామాజిక సమరస్యతలు నేర్చుకున్నారు. ఇక నాలుగో గురువు సమర్థ రామదాసు. వీరి దగ్గర ఆధ్యాత్మిక, హైందవ పరిరక్షణ, జీవిత పరమార్ధాన్ని నేర్చుకున్నారు. ఈ విధంగా వీళ్ళు శివాజీ వ్యక్తిత్వము అన్ని రకాలుగా అత్యంత శక్తివంతునిగా తీర్చిదిద్దారు.
ఒక్కసారి శివాజీ తండ్రిగారైన షాహాజీ 12 సంవత్సరాలైన శివాజీ ని కూడా తను పనిచేస్తున్న బీజాపూర్ సుల్తాన్ దర్బార్ కి తీసుకువెళ్లారు. అప్పుడు సుల్తాన్ కి సలామ్ చేసిన తండ్రి, కొడుకు శివాజీని కూడా సలామ్ చేయమని చెప్పారు. అప్పుడు శివాజీ "పరాయి రాజు ముందు వంగి సలామ్ చేయను" అని అన్నారు శివాజీ. తండ్రి శివాజీ ధైర్యాన్ని మనసులోని అభినందించారు. బాల్యము నుండి అంతటి దేశభక్తి, జాతీయ అభిమానము కలిగినవాడిగా శివాజీని తీర్చిదిద్దిండి ఆయన తల్లి జీజాబాయి గారు.
గెరిల్లా యుద్ధము
శివాజీకి 16 సంవత్సరాల వయసులోనే కత్తి పట్టి వెయ్యి మంది సైనికులతో పోరాడి బీజాపూర్ సుల్తాన్ ఆధీనములో ఉన్న తోర్నకోటపై దాడి చేసి స్వాధీనము చేసుకున్నారు. 1647 వ సంవత్సరములో కుందన్ రాజ్ గత్ కోట మరియు పూణేదక్షిణ ప్రాంతముపై విజయము సాధించారు. 1654లో పశ్చిమ కొంకన్ తీరాని గెలిచారు. ఓటమి తప్పదు అన్న ఆలోచన వస్తే యుద్ధము నుంచి తప్పుకోవాలి. అనువైన సమయము వచ్చినప్పుడు దాడి చేసి దక్కించుకోవాలి. ఈ మాటలను ప్రపంచానికి మొట్టమొదటిగా పరిచయము చేసింది శివాజీ. దీనిని గెరిల్లా యుద్ధము అని అంటారు.
1659లో బీజాపూర్ మహారాజు కోపానికి హద్దులు లేకుండా పోయాయి. బీజాపూర్ మహారాజు కోపానికి కారణము శివాజీనే. అప్పుడు ఆ యువరాజు యుద్ధము ప్రకటించారు. వేల సైన్యముతో వచ్చిన ఆ రాజు పై యుద్ధము చేయలేను అని శివాజీ ముందుగానే గ్రహించి పోరాటాన్ని ఆపేశారు. తర్వాత ఆ రాజు చర్చలకు రమ్మని పిలిపించారు. శివాజీ కూడా చర్చల కోసము ఒంటరిగా వెళ్లారు. ప్రమాదము తప్పదు అని గ్రహించిన శివాజీ నవంబర్ 10న అఫ్జల్ ఖాన్ ని చంపేశారు.
శివాజీ ముస్లింలకు ఇచ్చే గౌరవము
శివాజీ అన్ని మతాలను గౌరవించేవారు. తన రాజ్యములో ముస్లిమ్ సోదరులను కూడా పెద్ద ఆసనాలపై కూర్చొని పెట్టేవారు. హిందూ దేవాలయాలతో పాటు ఎన్నో మసీదులు కూడా కట్టించారు. శివాజీ సైన్యములో మూడు వంతులు ముస్లింలు ఉండడమే కాకుండా ప్రముఖ విభాగాలైన ఆయుధాల విభాగానికి హైదర్ అలీ, నావిక దళానికి ఇబ్రహీం ఖాన్, మందు గుండలు విభాగానికి సిద్ధి ఇబ్రహీం, అధ్యక్షత పదవి బాధ్యతలను ఇచ్చారు. దౌలత్ ఖాన్, సిద్ధిక్ లు సర్వ సైన్యాధ్యక్షులుగా ఉండేవారు. శివాజీ అంగరక్షకులలో చాలా ప్రముఖ వ్యక్తి అయినా మదాన్ని మహుతర్ ఉండేవారు. ఇతను శివాజీని ఆగ్రాకోట నుంచి తప్పించడములో ప్రముఖ పాత్ర పోషించారు.
శివాజీ మహిళలకు ఇచ్చిన గౌరవము
శివాజీ ఎప్పుడు మహిళల క్షేమాన్ని కోరుకునేవారు. శివాజీ సైనికులు ఒక అత్యంత సుందరమైన ముస్లిమ్ యువతిని బలవంతంగా తీసుకువచ్చి శివాజీ ముందు హాజరు పరిచారు. వారి చర్యను అభినందించి శివాజీ బహుమానము ఇస్తారని వారు అనుకున్నారు. అయితే, సైనికులు ని హెచ్చరించి శివాజీ ఆమె కాళ్ళపై పడి "తల్లి నా సైనికులు చేసిన పనికి క్షమించు. నా తల్లి కూడా ఇంత అందంగా ఉండి ఉంటే, నేను ఇంకెంత అందంగా పుట్టి ఉండేవాడినొ" అని ఆ ముస్లిమ్ యువతీని సకల రాజ లాంఛనాలతో ఆమె ఇంటికి క్షేమంగా పంపించారు శివాజీ. ముస్లింలు, అన్య మతస్తులు, ప్రముఖంగా మహిళలకి ఎనలేని గౌరవాన్ని ఇచ్చారు శివాజీ.
శివాజీకి భ్రమరాంబికా దేవి అమ్మవారు ఇచ్చిన ఖడ్గము
1677 లో భాగ్యనగరము వచ్చిన శివాజీ అక్కడి నుంచి శ్రీశైలం వెళ్లి అష్టాదశ శక్తి పీఠాలలో ఒక్కటైనా భ్రమరాంబ దేవినీ దర్శించారు. ఆమెకు తన శిరస్సును బలిగా ఇద్దామని ప్రయత్నిస్తూన శివాజీకి అమ్మ ప్రత్యక్షమై "నీ శిరస్సు నాకెందుకు, నీ అవసరము దేశానికి చాలా ఉంది. నీ మేధస్సుని ధర్మ రక్షణకై వినియోగించు" అని పలికిన అమ్మ శివాజీకి ఒక ఖడ్గాన్ని కానుకగా ఇచ్చింది. శివాజీ శేష జీవితాన్ని ధర్మ రక్షణకై వినియోగించారు.
శివాజీకి ఔరంగజేబుకి మధ్య శత్రుత్వము
1657 వ సంవత్సరము వరకు మొగల్ సామ్రాజ్యము తో మంచి సంబంధాలే ఉండేవి శివాజీకి. ఔరంగజేబుకు తాను చేసే యుద్ధాలలో శివాజీ చాలా సహాయము చేసేవారు. సహాయనికి ప్రతిఫలంగా బీజాపూర్ కోటను అడిగారు శివాజీ. కానీ, ఔరంగాజేబు దానికి అంగీకరించలేదు. 1657వ సంవత్సరము మార్చ్ లో ఔరంగాజేబ్ సామ్రాజ్యము పై శివాజీ అనుచరులు దాడి చేశారు. దాంతో మొగల్ వారితో శివాజీకి శత్రుత్వము ఏర్పడింది. సూర్యోదయము నుంచి సూర్యాస్తమయము వరకు యుద్ధము చేయాలి అనేది ధర్మము. శివాజీ మాత్రము ఔరంగాజేబు మేనమామ అయిన సైస్తూ ఖాన్ పై 1663 ఏప్రిల్ 13న అర్ధరాత్రి దాడి చేశారు. మొగల్ సైన్యాన్ని దెబ్బ కొట్టడముతో చేతివేళ్లను పోగొట్టుకున్న సైస్తూ ఖాన్ పూణే వదిలి ఆగ్రాకు పారిపోయారు. తర్వాత శివాజీని చర్చలు కు రామని 1666 మే 29న పిలిచి ఆగ్రా లో బంధించారు. అక్కడి నుంచి శివాజీని ఆఫ్ఘనిస్తాన్ కు పంపించాలి అని ప్రయత్నించారు. కానీ, అది తెలుసుకున్న శివాజీ అనుచరులు శివాజిని తప్పించారు.
శివాజీ పట్టాభిషేకము
1674 జూన్ 6వ తేదీన ఆనంద నామ సంవత్సరము, జ్యేష్ట శుద్ధ త్రయోదశి గురువారం నాడు మహారాజ చత్రపతిగా శివాజీకి పట్టాభిషేకము జరిగింది.
సతీసహగమనాన్ని నిషేధించారు. జమీందారీ మతము దారి వ్యవస్థలను రద్దు చేశారు. తన రాజ్యములో వ్యవసాయము మెరుగుపడేలా చేసి యంత్రాలను కూడా వినియోగించేలాగా చేశారు.
శివాజీ మరణము
శివాజీ ని అంతము చేయాలనుకున్న అతని శత్రువులకు శివాజీ రెండో భార్య అయినా సోయారాబాయి ఆయుధంగా మారింది. శివాజీకి ఇద్దరు కుమారులు. మొదటి భార్య కుమారుడు శంభాజీ. రెండో భార్య కుమారుడు రాజారామ్. శివాజీ రాజ్యములో శంభాజీ మాటలు ఎక్కువగా నెగ్గడముతో అది చూసి ఓర్వలేని సోయారాబాయి శివాజీ శత్రువులతో చేతులు కలిపింది. శివాజీ ఎక్కువగా శంభాజీని ప్రోత్సాహించేవారు. శివాజీ చనిపోయే ముందు అతనికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. చూస్తుండగానే శివాజీ మంచాన పడ్డారు. అది అలుసుగా తీసుకొని అతని రెండో భార్య సోయారాబాయి శివాజీకి విషము ఇచ్చి చంపిందాని అందరూ అంటూ ఉంటారు.
శివాజీ మరణించగానే తన కుమారుడు రాజారామ్ ని మహారాజుగా చేసింది సోయారాబాయి. అప్పుడు రాజారామ్ కి కేవలము 10 సంవత్సరాల వయసు. తండ్రి మరణము తర్వాత బయటికి వెళ్లిన శంభాజీ కొద్ది రోజులకు తిరిగి వచ్చి రాజ్యాన్ని చేజిక్కించుకొని సోయారాబాయి, రాజారామ్ ని జైలుకు పంపారు. శంభాజీ చనిపోయిన తర్వాత రాజారామ్ రాజు అయ్యారు.