కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయము....
తెలుగు నేలపై స్వయంభుగా వెలసిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి, సత్య ప్రమాణమే నిలువుగా ధర్మాన్ని కాపాడుతూ నిత్యం పెరిగే మహాగణపతి, సర్వమత ఆరాధ్యుడిగా మతసామ్రస్యాన్ని చాటే విగ్నేశ్వరుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోనీ కాణిపాకం అనే గ్రామంలో బహుద నది ఒడ్డున ఉంది వరసిద్ధి వినాయక పుణ్యక్షేత్రం.
శ్రీ కాణిపాక వినాయక స్వామి వారు కాణిపాకం లో వెలసిన కథ
స్వయం మూర్తిగా వెలసిన ఈ స్వామివారికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. పూర్వం విహారపురి అనే గ్రామంలో గుడ్డి, మూగ, చెవిటి వంటి అంగవైకల్యం కలిగి ఉన్న ధర్మాత్ములైన ముగ్గురు అన్నదమ్ములు జీవిస్తూ ఉండేవారు. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. ఒక దశలో ఆ గ్రామం కఠిన కరువుతో అల్లాడిపోతూ ఉండేది. అప్పుడు ప్రజలకు కనీసం దాహం తీర్చుకోవడానికి చుక్క నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో కరువును జయించాలి అని సంకల్పంతో ఆ ముగ్గురు అన్నదమ్ములు వారి పొలంలో ఉన్న బావిని మరింత లోతుకు తవ్వడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి, ఆ రాతి నుండి రక్తం నీరుల ఉప్పొంగుతుంది. ఆ బావి అంతా నిండిపోయిన రక్తం, ధర్మాత్ములైన ఆ సోదరులను తాకగానే వారికి గల అవిటితనం పూర్తిగా పోయి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారిపోయారు. ఈ మహిమ గురించి తెలుసుకున్న గ్రామస్తులు బావి లోపల పూర్తిగా పరిశీలించగా గణనాధుని రూపం కనిపిస్తుంది. అప్పుడు గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పూజించి స్వామివారికి కొబ్బరికాయలు కొట్టారు. ఆ కొబ్బరికాయల నీళ్లు ఎకరం పొలంమేరా పారిందంట. కాణి అంటే భూమి, పాకం అంటే నీరు అందుకే ఈ గ్రామానికి కాణిపాకం అనే పేరు వచ్చింది.
శ్రీ కాణిపాక వినాయక స్వామి విగ్రహం విశేషాలు:
కాణిపాకం వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతాడు. దీనికి నిదర్శనం గా 50 సంవత్సరాల కిందటి వెండి కవచం ఇప్పుడు స్వామివారికి సరిపోవడం లేదు. 2002 సంవత్సరంలో సమర్పించిన వెండి కవచం కూడా ప్రస్తుతం స్వామివారికి ధరింప చేయడం సాధ్యం కావడం లేదు. స్వామి వారు పెరుగుతున్నారు అనడానికి ఇది గొప్ప నిదర్శనం.
స్వామి వారి విగ్రహం కొద్దిగా నీటిలో మునిగి ఉంటుంది. ఎంత తవ్విన స్వామివారి తుది మాత్రం కనుగొనక లేక పోయారు.
సత్య ప్రమాణము
బ్రిటీష్ కాలంలో ఇక్కడ చేసే ప్రమాణాలను న్యాయస్థానంలో కూడా ప్రామాణికంగా తీసుకునే వాళ్ళు. ఇక్కడ చేసే ప్రమాణంలో ఎవరైతే అబద్ధం చెబుతారో వారిని స్వామివారే స్వయంగా శిక్షిస్తారని ఇక్కడ భక్తులు నమ్మేవారు. ఇక్కడ స్వామి వారి ముందు అబద్ధం ప్రమాణం చేయడానికి ఎవ్వరూ సిద్ధపడరు.
ఆలయ ప్రాంగణంలోని బావి
ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒక బావి ఉంది. ఆ బావిలో స్వామివారి వాహనమైన మూషికం ఉంటుంది. అక్కడ స్వామివారికి మనకు ఇష్టమైన పదార్థము ఏదైనా వదిలేస్తే మనం కోరిన కోరికలను తీర్చేస్తారు ఈ వరసిద్ధి వినాయక స్వామి.
మణికంఠేశ్వర స్వామి ఆలయము
స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారి గుడికి వాయువు దిశగా ఉన్న మణికంఠేశ్వర స్వామి ఆలయానికి ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం. ఈ ఆలయాన్ని చోళ రాజైన రాజ రాజేంద్ర చోళుడు నిర్మించాడు. ఈ ఆలయంలో అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి.